ప్రజల మనిషి నవల; ప్రాసంగికత – డా. ఇమ్మిడి మహేందర్

ప్రజల మనిషి నవల – ప్రాసంగికత – డా. ఇమ్మిడి మహేందర్

ఒక కాలం నాటి సామాజిక అవసరాల్లోంచి పుట్టిన రచన నేటికి ప్రాసంగికంగా ఉన్నదంటే సమాజంలో అభివృద్ధి, మార్పు ఆశించినంత ప్రగతిశీలంగా లేదనేది స్పష్టం. ఈ కోణం నుంచి చూసినప్పుడు ‘ప్రజల మనిషి’ నవల ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ‘ప్రజల మనిషి’ నవలా రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి. ఈయన తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వికాసాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యమకారుడు. తన సమకాలీనులెవ్వరూ ప్రవేశించడానికి కూడా సాహసించని రంగాలను ఎంచుకొని, తనకంటూ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి. రాశిలో తక్కువైనా వాసిలో మెండుగా రచనలు చేసాడు. ఈయన రచనలు తెలంగాణ ప్రజల జీవితాలకు అద్దంలో చూపెట్టాయి. సాధారణంగా రచయితలు తమ కళ్లెదుట జరిగిన దాన్ని చూడటం, లేదా ఇతరులు చెప్పడం ద్వారా జీవితాలను చిత్రించే ప్రయత్నం చేస్తారు. కానీ, వట్టికోట ఆళ్వారు స్వామి స్వానుభవంతో రచనలు చేసారు. తెలంగాణను నిండుగా ఆవాహన చేసుకొని, తెలంగాణ సమాజమే మాట్లాడినట్లుగా, బాధలను వ్యక్తం చేసినట్లుగా సాహిత్యాన్ని వెలువరించడం వట్టికోట ఆళ్వారు స్వామి సాధించిన విజయం.ఆంధ్ర మహాసభ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంగా 1930ల నుంచి 1950 వరకు తెలంగాణ జీవితాన్ని మూడు నవలల్లో చిత్రించాలని ఆళ్వారుస్వామి ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా 1938 పూర్వపు భాగానికి సంబంధించి రాసిన తొలి నవల ‘ప్రజలమనిషి’. ఈ విధంగా ప్రజల మనిషి నవలలోని వస్తువు 1930ల కాలం నాటిది. ఈ నవలను 1950లో రాయడం మొదలు పెట్టి 1955లో పూర్తి చేశాడు. ఇందులో వట్టికోట ఆళ్వారు స్వామి జీవితం, ఆనాటి ఉద్యమ పరిస్థితులు కన్పిస్తాయి. ఏ రచన కూడా శూన్యంలోంచి ఉదయించదు అనేది ఒక అవగాహన. దీనికి సామాజికార్థిక, రాజకీయ పరిణామాలు ఆలంబనగా నిలుస్తాయి. ఈ పరిణామాల్లోంచే రచయిత రూపొందుతాడు. ప్రతీ రచయితపై స్థల, కాల ప్రభావాలు ఉంటాయి. సామాజిక అవసరాల్లోంచే రచయితలు రూపొందుతారు. మరో మాటలో చెప్పాలంటే కాలం కడుపుతో ఉండి తన వ్యాఖ్యాతలను తయారు చేసుకుంటుంది. రచయితలు చేసే గొప్ప పని ఏమంటే వ్యక్తిగత జ్ఞానాన్ని సామూహిక జ్ఞానం వైపు మళ్లించి, కల్లోల కాలానికి ప్రతినిధులుగా నిలవడం. ఈ దృష్టి నుంచి ప్రజల మనిషి నవలను అధ్యయనం చేయవచ్చు.

వట్టికోట ఆళ్వారు స్వామిని తెలంగాణ వైతాళికుడిగా అందరూ గుర్తిస్తారు. “వర్తమాన తరాన్ని ప్రభావితం చేయడంతో పాటు, భవిష్యత్తు తరాన్ని కూడా ప్రభావితం చేసే వ్యక్తిని వైతాళికుడు” అని అంటారు. ఆనాడు వర్తమానంగా ఉన్నటువంటి అనేక మంది రచయితలకు వట్టికోట ఒక ప్రేరణగా నిలవడంతో పాటు, తర్వాతి తరాలకు కూడా ఆదర్శంగా నిలిచాడు. ఈయన నవలా రచయితగానే కాకుండా, కథా రచయితగా, ఉద్యమకారుడిగా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా భిన్నమైన పాత్రలను పోషించాడు. నిబద్దుడిగా ఉంటూ ప్రజల పక్షాన నిలిచిన రచయిత. ఈ నవలలోని అంశాలను వర్తమాన ప్రాసంగికత కోణం నుంచి అధ్యయనం చేయాలంటే ఇందులోని విషయాన్ని క్రోనాలజికల్ ఆర్డర్‌గా అధ్యయనం చేస్తే ఈ భావనకు సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాము.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, గ్రంథాలయోద్యమం, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక సామాజిక, రాజకీయ ఉద్యమాలన్నింటికి నల్లగొండ జిల్లా భూమికగా పనిచేసింది. ఉద్యమ చైతన్యానికి నెలవు అయిన నల్లగొండ జిల్లా, చెరువు మాదారంలో వట్టికోట ఆళ్వారు స్వామి 1915 నవంబర్ 1వ తేదీన పుట్టారు. వీరి తల్లిదండ్రులు సింహాద్రమ్మ, రామాచంద్రాచార్యులు. వీరిది పేద వైష్ణవ బ్రాహ్మణ కుటుంబం. చిన్ననాటి నుండే అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని, పేదరికాన్ని అనుభవిస్తూ చదువును కొనసాగించాడు. వట్టికోట గురువు సీతారామారావు గారు. ఈయన దగ్గర శిష్యరికం చేస్తూ, వండి పెడుతూ, విద్యాభ్యాసం చేసాడు. ఈ క్రమంలోనే సీతారామారావుకు సూర్యాపేట పాఠశాలకు బదిలీ కావడంతో, ఆయన వెంట వెళ్లి అక్కడ గ్రంథాలయోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అక్కడ కొంతమంది పెద్దవాళ్లతో పరిచయం ఏర్పడుతుంది. ఈ విధంగా ఒక కార్యకర్తగా నిరంతర కృషి చేస్తూ, నిరంతర జ్ఞాన పిపాసిగా తిరుగుతూ, కోదాటి నారాయణరావుతో సావాసం చేసి 1933లో గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా చేరాడు. అప్పటికి తెలుగు సమాజంలో ప్రముఖంగా ఉన్నవారితోను, గ్రంథాలయోద్యమంలోను, సంఘ సంస్కరణోద్యమంలోను కార్యకర్తలందరితో కలిసి పనిచేసాడు. నిజానికి ఈ కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. 1930, 1940లలో ప్రారంభమైన వారు మొదటగా చైతన్యవంతులు అయ్యారు. వీళ్ళందరూ సాహితీకారులుగా ఉండటంతో పాటు, అదే సమయంలో రాజకీయ కార్యకర్తలుగా కూడా పనిచేయాల్సి వచ్చింది. ఇది ఆనాటి ప్రత్యేక స్థితి.

కోదాటి నారాయణరావు గారితో పరిచయం వల్ల గోల్కొండ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డి పరిచయం ఏర్పడింది. వీరితో పని చేయడం తన ఆలోచనల్లో మార్పును తీసుకువచ్చింది. సమాజాన్ని విస్తృతంగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది. ఆయనకు ఒక సంఘర్షణాత్మకమైన జీవితం ఉన్నది. చదవడాన్ని ఇష్టపడ్డవాడు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాడు. ప్రజా ఉద్యమాలలో ఉన్నాడు. గ్రంథాలయ ఉద్యమంలో కాలుకు బలపం కట్టుకొని పనిచేసాడు. ఆంధ్రోద్యమం నాయకులతో పనిచేసాడు. తర్వాత ‘దేశోద్ధారక గ్రంథమాల’ అనే పేరుతో దాదాపు 35 నుండి 40 పుస్తకాల వరకు రాయించి, ప్రచురణ చేయించారు. పౌరహక్కుల కార్యకర్తగా ఉన్నాడు. ఆనాడు దొడ్డి కొమురయ్య చంపేస్తే అక్కడి నిజనిర్ధారణ కమిటీలో పాల్గొన్నాడు.

వట్టికోట 1940 తర్వాత రచయితగా ప్రారంభమయ్యాడు. గోల్కొండ, మీజాన్, ఆంధ్రకేసరి, గుమాస్తా, కేసరి వంటి పత్రికల్లో విస్తృతంగా వ్యాసాలు, కథలు, విశ్లేషణలు రాసారు. అలాగే రాజకీయ ఉద్యమాలలో పాల్గొంటూనే, పౌరహక్కుల కోసం, రిక్షా కార్మికుల కోసం అనేక ఉద్యమాలు చేసారు. గుమాస్తాల కోసం ప్రత్యేకంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, కార్మికులలో చైతన్యాన్ని నింపాడు. వారి కోసం ‘గుమాస్తా’ అనే పత్రికను ఏర్పాటు చేసాడు. తన జీవితమే ఒక పోరాటంగా మలుచుకున్నాడు. లోతుగా ఆలోచిస్తే ప్రజల మనిషి నవల ఒక్కటే కాదు, ప్రజల మనిషిగా రూపాంతరం చెందిన వట్టికోట ఆళ్వారు స్వామే ఇప్పుడు అత్యంత ప్రాసంగికత కలిగి ఉన్నాడు. ఆయన ఆచరణ, రచన రెండు ఇప్పుడు ప్రాసంగికమే.

రచయిత తన భావాలను వివిధ పాత్రల ద్వారా వ్యక్తం చేస్తాడు. అలా ప్రజల మనిషి నవలలో వ్యక్తం చేసిన భావాలు నేటికి ప్రాసంగికత్వం కలిగి ఉన్నాయి. ప్రజ్ఞావంతుడైన రచయిత ఆ రచన తత్వాన్ని కేవలం ఒక్కమాటలో చెప్పేస్తాడు. సరిగ్గా ఈ నవల కూడా అటువంటి వాక్యంతో ప్రారంభమవుతుంది. ఒక ఎద్దుకు సంబంధించిన ఒక సంఘటన చెబుతూ “అందరికీ సంబంధించినదిగా తలచబడే వస్తువును ఇతరుల హరించబోతుంటే అడ్డుపడి రక్షించుకునే ఆలోచన తన ఎద్దుకు కలిగినందుకు, మానవుని ప్రవృత్తి తన ఎద్దుకు అలవడినందుకు ఆనందిస్తూ కోటయ్య కొట్టంలోకి వెళ్తాడు” ఈ వాక్యంతో ప్రజల మనిషి నవల ప్రారంభమవుతుంది. సామూహిక జ్ఞానాన్ని, సామూహిక చైతన్యాన్ని కూడా అణచివేస్తున్న క్రమంలో అందరిదిగా భావించే సంపద అంతా కూడా మాది అని రక్షించుకునే ప్రయత్నాన్ని మానవ సమాజం అలవరచుకోవాలనే సూచన ఇందులో కనబడుతుంది. ఎక్కడ అన్యాయం ఉంటుందో, అక్కడ అప్రయత్నంగానే ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటనను అణువణువున ఈ నవల చిత్రించింది. ఈ ప్రతిఘటన చైతన్యాన్ని మనం క్రమ పద్ధతిలో తెలుసుకుంటాం.

ప్రజల మనిషి నవలలో మొదట వెట్టిచాకిరి గురించిన ప్రస్తావన వస్తుంది. 1930ల నాటి తెలంగాణ సమాజం ఏ విధంగా రాచరిక పాలనలో అవస్థ పడ్డది, ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నది, రాజకీయ వ్యవస్థ ఎలా ఉన్నది? పాలన వ్యవస్థ ఎలా ఉన్నది, గ్రామాలలో ఉండే దేశ్‌ముఖులు, దొరలు, పోలీస్ పటేళ్ల పీడన ఎలా ఉండేది?, వారు ప్రజలను ఎట్లా పీడించేవారు? వాళ్ళ భూములను దుర్మార్గంగా లాగేసుకునే భూమి సమస్య, మతాంతరీకరణ సమస్య, గస్తీ నిషాని లాంటి చట్టాలు ఈ నవలలో ఉన్నాయి. ఈ అంశాలను ప్రస్తుతం 2000 తర్వాత పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు వెట్టి చాకిరి పోయింది. కానీ, అది రూపం మార్చుకున్నది. భూమి సమస్య అలాగే ఉంది.

ప్రజల మనిషి నవల నిజామాబాద్ జిల్లా, దిమ్మగూడెం అనే గ్రామంలో ప్రారంభమై, హైదరాబాదులో సత్యాగ్రహం చేసేంతవరకు విస్తరిస్తుంది. ఈ గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళే కొమురయ్య, కంఠీరవం. వీరు ప్రధాన పాత్రలు. ఆ ఊరి దొర రాంభూపాలరావు. ఆ దొర బిడ్డ పెళ్లి సమయంలో కొమురయ్య కుటుంబం ఒక ఆవుని ఇవ్వాల్సి వస్తుంది. కంఠీరవం వాళ్ళు విస్తరాకులు కుట్టి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇద్దరి పసి మనసుల్లో ఒక ప్రశ్న మొదలవుతుంది. దొర ఇంట్లో పెళ్లి అయితే మనం ఆవుని ఇవ్వడమేంటి? విస్తరాకులు కుట్టివ్వడం ఏమిటి? అనే ప్రశ్నలతో ఈ నవల ప్రారంభమవుతుంది. కంఠీరవం చిన్నతనంలోనే తండ్రి రఘునాథాచార్యులు మరణిస్తాడు. కొంతకాలానికి సోదరుడు వేంకటాచార్యునికి పనిచేయడం చేతగాక, సరైన ఆలోచన విధానం లేక, దొర పంచలో చేరి నిత్యం తన తల్లిని, తమ్ముడ్ని తిడుతూ, ఇంట్లో ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. వీటికి తట్టుకోలేక కంఠీరవం బయటికి వెళ్లిపోతాడు.

గ్రామంలో కొమురయ్య సాగు చేస్తున్న పొలాన్ని తన తండ్రి కోటయ్యకు, ఆ గ్రామం నుండి వలస వెళ్లిన ఒక బ్రాహ్మణ కుటుంబం దున్నుకునేందుకు కౌలుకి ఇస్తారు. మంచిగా వ్యవసాయం చేసుకుంటున్న కొమురయ్య పొలం మీద దొర కన్ను పడుతుంది. కంఠీరవం అన్న అయిన వేంకటాచార్యునితో దొర కుమ్మక్కై, గతంలో అప్పు కింద జప్తు చేసుకున్న మీ పొలాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాను, కానీ, కొమురయ్య పొలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించాలని, హైదరాబాద్ కి తీసుకెల్తాడు. అక్కడ దొంగ సంతకాలు, పంచులు పెట్టి కొమురయ్య భూమిని గుంజేసుకుంటాడు. ఈ నవలలో చైతన్యం భూమి చుట్టూ ముడిపడి ఉంటుంది. వేంకటాచార్యులు తండ్రి రఘునాథాచార్యుల భూమిని అన్యాయంగా దొర గుంజుకుంటున్నప్పుడు పొలం ఇచ్చింది మీరే, తీసుకుంటుంది మీరే అని వదిలేసాడు. కూటికి లేక, పోరాటం చేయలేక కుమిలిపోయి, చనిపోతాడు. అక్కడ ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. కానీ, కాలక్రమంగా చైతన్యం పెరిగింది. కొమురయ్య భూమి దగ్గర సమస్య చైతన్య రూపం తీసుకుంటుంది. కొమురయ్య తల్లి అన్నమ్మ దొర నాగలికి అడ్డం పడుతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు. కానీ, ఈ భూమిని మాత్రం నేను వదిలిపెట్టనని ఆమె పోరాటం చేస్తుంది. అప్పటికి నాగళ్ళు ఆగిపోతాయి. కానీ, సమస్య అక్కడితో ఆగిపోదు. కొమురయ్య తన భూమి విషయం మాట్లాడాలని దొర రాంభూపాలరావు దగ్గరికి పోయినప్పుడు నా పొలంలో, నా నాగళ్ళను ఆపి, నాతో మాట్లాడటానికి వచ్చినవా అని కొమురయ్యను విపరీతంగా కొడతాడు. దొరకు వ్యతిరేకంగా పోరాడలేని పరిస్థితిలో భూమిని వదిలిపెట్టాల్సి వస్తుంది. మొదటి దశ భూ సమస్యకు, రెండవ దశ భూ సమస్యకు మౌలిక మార్పు వచ్చింది. అది ప్రతిఘటన. కానీ, విజయం సాధించలేక పోయారు.

ఇక కంఠీరవం ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయి నిజామాబాద్ జిల్లాలో గ్రంథాలయోద్యమంలో చురుకైన పాత్రను పోషించాడు. దిమ్మగూడెం ఊరిలో చంద్రయ్య కొమురయ్యలు స్థానిక సమస్యల నుంచి వర్గ చైతన్యాన్ని పొందుతున్నారు. ఇటువంటి సందర్భంలోనే జాతీయోద్యమంతో చైతన్యవంతమైన కంఠీరవం గ్రామానికి వస్తాడు. గ్రామంలోని వర్గ చైతన్యం, బయట ఉన్నటువంటి జాతీయోద్యమ చైతన్యంతో కలిసి అక్కడ ప్రజా పోరు నడుస్తుంది. పాలకులు ఎవరైనా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలనే ఒక వాతావరణం ఏర్పడుతుంది. గ్రంథాలయోద్యమం విస్తరిస్తుంది. పత్రికలు వస్తాయి. వీధి బడులు, రాత్రి బడుల్లో చదువు ప్రారంభం అవుతుంది. ఆర్య సమాజం కార్యక్రమాలు విస్తృతమవుతాయి.

నవలలో కొమురయ్య భూమి సమస్య ఉన్నట్లుగానే. నేటి సమాజంలో కూడా భూమి సమస్య అత్యంత తీవ్ర స్థాయిలో ఉంది. పేదలు, దళితులు, వెనుకబడిన జాతులకు ఉండే ఎకరం, రెండెకరాల భూములను కూడా ప్రాజెక్టుల పేరుతో గుంజుకునే ప్రయత్నం చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూమిని తక్కువ రేటుకు కొనాలని ప్రయత్నిస్తున్నారు. అమ్మడానికి సిద్ధపడని కుటుంబాలపై భౌతిక దాడులు చేస్తున్నారు. వారికి వచ్చే మార్కెట్ అవకాశాలను తగ్గిస్తూ ఆధునిక భూమి సమస్యలను సృష్టిస్తున్నారు. ఇటువంటి భూమి సమస్యలు ప్రస్తుతం ప్రజలను కదిలిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో ఫార్మాసిటీ భూముల కోసం పొలాలను ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. కందుకూరు మండలానికి చెందిన ఒక మహిళా రైతు తన భూమిని ఇవ్వను అని, నవలలో కొమురయ్య తల్లి అన్నమ్మ పాత్రలాగా ఎలాగైతే పోరాటం చేసిందో, ఇక్కడ చంద్రమ్మ అనే స్త్రీ కూడా పోరాటం చేసింది. ఈ పోరాటం ప్రధాన శీర్షికగా పత్రికల్లో వచ్చింది. ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఆనాడు అన్నమ్మ చేసిన పోరాటం ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉంది. ఆనాడు నేరుగా దొరలు దౌర్జన్యం చేస్తే, నాటి ఆ దొరలే నేడు ప్రభుత్వంలో చేరి భూములను గుంజుకుంటున్నారు. దోపిడి అలాగే ఉంది. దోచుకునే పద్ధతి మారింది. విధానం మారింది. ఆనాడు అన్నమ్మ పాత్ర, నేడు చంద్రమ్మ. రెండు సందర్భాలలో స్త్రీలై చైతన్యానికి ప్రతీకలుగా నిలిచారు. భూ పోరాటంలో ముందున్నారు.

ఆనాడు మతాంతరీకరణ అనేది ముఖ్యమైన సమస్య. నైజాం రాజ్యంలోని హరిజనులని ముస్లింలుగా మార్చాలనే ప్రయత్నం జరిగింది. దిమ్మగూడెంలోని ప్రజలను ముస్లి మతంలోకి మార్చడానికి హైదరాలి, తన మేనల్లుడిని తీసుకొని వస్తాడు. ఈ మతాధికారి గ్రామానికి వచ్చి దళితులను ముస్లిం మతంలోకి మారుస్తుంటాడు. వాళ్ల పేర్లను మార్చేసి, కొత్త పేర్లు పెట్టి, వాళ్ల మొలతాళ్లను, హిందూ సంప్రదాయాలు లేదా అప్పటికి ఉన్నటువంటి ప్రధాన స్రవంతి సంప్రదాయాలను తీసేస్తారు. భయానికో, భక్తికో మతం మారినవారు ప్రధాన గ్రామ స్రవంతిలో కలవలేక ఇబ్బంది పడతారు. దొరలు మతం మారిన వారికి పనులకు పిలువరు. కూటికి, మాటకు నష్టపోతారు.

మతాంతరీకరణ జరిగినప్పుడు పేదలు తమకు భూములు ఇస్తారని ఆశపడతారు. భూమి గురించి అడిగినప్పుడు హైదరాలి పేరు చెప్పి వెళ్లిపోతాడు. ఇలా మోసం ప్రజలను మోసం చేస్తున్న హైదరాలి, ఆ ఊరి దొర రాంభూపాలరావుని ప్రజలందరిలో కంఠీరవం నిలదీస్తాడు. మతం మారితే భూములు ఇస్తారా, మాకు తిండి దొరుకుతుందా అనే ప్రశ్నలను లేవనెత్తుతారు. దోపిడికి హిందూ, ముస్లిం అనే మతం ఉండదని ప్రజలను చైతన్యవంతం చేస్తాడు. ఇక్కడ రాంభూపాలరావు, హైదరాలి ఇద్దరు కంఠీరవాన్ని రాజద్రోహం కింద అరెస్టు చేయిస్తారు. ఆయనను బంధిస్తారు. రాజ్య ద్రోహం కేసు పెడతారు. అప్పుడు ఆయన అన్నమాట ఇప్పటికీ ప్రాసంగికత కలిగి ఉంది. ప్రజలను చైతన్యం చేయాలని ప్రయత్నించిన ప్రతి సందర్భంలోను, మేధావుల మీద, ప్రజా సంఘాల కార్యకర్తల మీద, లాయర్ల మీద, విద్యార్థుల మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తున్నారు.

1950లో రాయబడిన ప్రజల మనిషి నవలలో సరిగ్గా ఇట్లాంటి చైతన్యమే కంఠీరవం పాత్ర ద్వారా పలికిస్తాడు. “నేను రాజ ద్రోహం చేశానని నాపై నేరము. కాని దేశద్రోహులు, ప్రజా ద్రోహులు మాత్రమే నన్ను రాజ ద్రోహులంటున్నారు. మీరు ఏర్పరచుకున్న న్యాయస్థానాలు, న్యాయ శాస్త్రాలు రాజనీతి కేవలం మీరనుకున్నట్లు పరిపాలన సాగటానికేనని ఈ అభియోగ విచారణ సందర్భంలో మా వైఖరి తేల్చి వేసింది” అనే ఈ కంఠీరవం మాటలు నేటికి ప్రాసంగికతను కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో హక్కుల కార్యకర్తల మీద, చైతన్యవంతుల మీద, విద్యార్థుల మీద, ప్రజా నాయకుల మీద, ప్రజా సంఘాల కార్యకర్తల మీద, రచయితల మీద ఇలా అందరి మీద కేసులు పెడుతున్నారు. ఎవరైతే ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాట్లాడుతారో, ప్రజా సమస్యల మీద తమ గొంతుకని వినిపిస్తారో వారిని ఇబ్బందులకు గురిచేయడం ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతుంది. జర్నలిస్టుల మీద, ప్రొఫెసర్ల మీద దేశవ్యాప్తంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. జేఎన్‌యూ మొదలు ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం దాకా కూడా విద్యార్థులు అణచివేతకు గురవుతున్నారు. ఈ సందర్భంగా 1955లో రాసినటువంటి ఆ మాట ఈనాటికి కూడా ప్రాసంగికత కలిగి ఉందన్న విషయం అర్థమవుతుంది. ఈ విధంగా 1930ల కాలం నాటి సామాజికార్థిక, రాజకీయ పరిస్థితులు 21 శతాబ్దంలో కూడా అత్యంత ప్రాసంగికతను కలిగి ఉన్నాయి.

Some more:

Recent Posts/Updates