నడుస్తున్న తెలంగాణకు స్వాగతం
ఒక సమాజ సంస్కారం వ్యక్తమయ్యేది బుద్ధిజీవులద్వారానే. అలాంటి ఆలోచనాపరులను తయారుచేసేది అక్షరం. అక్షర రూపం దాల్చిన జ్ఞానం సమాజం ఎల్లెడలా చైతన్యాన్ని వ్యాపింపజేస్తుంది. అక్షరం, పత్రికగా మారితే జ్ఞానం జనరాశుల్లోకి ప్రయాణిస్తుంది. ఘనీభవించిన సమాజ నిర్మాణాన్ని కదలబార్చే శక్తి పత్రికకు ఉంటుంది. పండిత సమూహంలో మాత్రమే తిరగాడే అక్షరం పత్రిక ద్వారా ప్రపంచపరమవుతుంది. అందుకే నడుస్తున్న తెలంగాణ పత్రిక ప్రజా కేంద్రంగా నిర్మాణమయింది. ఫ్యూడల్ వాసనలను త్యజించని తెలంగాణ సమాజాన్ని విశ్లేషించి గత వర్తమానాలతో ఎడతెగని సంభాషణ జరపాలని నడుస్తున్న తెలంగాణ లక్ష్యించింది.
అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణ తనకు తాను విముక్తం చేసుకోవాలని కోరుకున్నది. ఇలాంటి కోరికలో సమాజమంతా భాగస్వామ్యం తీసుకున్నది. ఇట్లా 90వ దశకంలో పెనుగులాటను ప్రారంభించిన తెలంగాణ ఆకాంక్షను అక్షరబద్ధం చేసి ప్రపంచానికి అందించాలనే ప్రాపంచిక దృక్పథమే నడుస్తున్న తెలంగాణ మాసపత్రికది. 2011 ఫిబ్రవరిలో ప్రారంభమై ఈనాటికి కాలం విసిరిన అనేక సవాళ్లను నడుస్తున్న తెలంగాణ స్వీకరించింది. ఆందోళనపడింది. తిరిగి తనను తాను సరిచేసుకొని నిలబడుతున్నది. గత, వర్తమానాల్ని అక్షరీకరించి పౌరసమాజం ముందు ఉంచుతుంది.
ఇప్పుడు తెలంగాణ సమాజం మరో తలంలోకి విస్తరించింది. శుద్ధ భౌగోళికవాదం నుంచి ప్రజాస్వామిక స్వప్నాన్ని ఆవిష్కరించాలని తపిస్తున్నది. దీనికి కావలసిన పరికరాలను, ప్రమేయాలను సమకూర్చుకొని సుదీర్ఘ సంభాషణలోకి ప్రవేశిస్తున్నది. ‘తెలంగాణ పునర్నిర్మాణం’ అనే మాటకు ‘History from the below’అనే వాచకాన్ని జోడించాలనే తపన నడుస్తున్న తెలంగాణది. ఉత్పత్తి శక్తుల ఏకీకరణ, విస్తరణ, నిర్మాణం అనే లక్ష్యాలు ఉంటేనే రాజకీయ అంకం ముగుస్తుందనే నమ్మకం ఈ పత్రికది.
సమాజ పొరల్లో విస్మరణకు గురైన విషయాల మీద సారవంతమైన పరిశోధన జరిగినప్పుడే సృజనాత్మక ఫలితాలు జనరాశులకు అందుతాయి. జీవిత ఇతివృత్తమే సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తుంది. ప్రకటిత సాహిత్యాన్ని అంచనా వేసి మూల్యాంకనం చేయకపోతే కళాత్మకం కానిదల్లా సాహిత్యంగా ఊరేగుతుంది. కనుక సమాజాన్ని, రాజకీయాల్ని, ఆర్థికాన్ని, సాహిత్యాన్ని హేతుబద్దంగా విశ్లేషించి, శాస్త్రీయంగా అంచనా వేసి, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే తలంపు నడుస్తున్న తెలంగాణది. ఆ విలువలతోనే పన్నెండేళ్లు మేము పూర్తి చేసుకున్నాం. ఈ నడకలో, నడతలో ఎందరో మాకు భుజాన్ని ఇచ్చారు. ఇకముందు కూడా మీ స్నేహం మాకు ఉంటుందని ఆశతో…
*సంపాదకవర్గం